ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో భార్య భద్రిపల్లె పద్మను ఆమె భర్త బద్రిపల్లి కిరణ్ విషమిచ్చి, ఆపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసిన కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో భార్య లావుగా ఉందని, ఎక్కువ తింటుందని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు.
అంతర్జాలంలో విషం కొనుగోలు చేసిన నిందితుడు
అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎనిమిదేళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ఏడు సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యను చంపాలని నిర్ణయించుకున్న కిరణ్, అంతర్జాలంలో వెతికి, రూ. 80 వేలు విలువ చేసే విష పదార్థాన్ని కొనుగోలు చేశాడు.
దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
గత నెల 26న కిరణ్ తన భార్యను ప్రొద్దుటూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చాడు. 29వ తేదీ రాత్రి, భార్యకు విషం పెట్టి, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళాక, దిండుతో ఒత్తి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం, తనకేమీ తెలియదన్నట్లు భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
పోస్టుమార్టం నివేదికతో అరెస్టు
మృతురాలి తండ్రి బెంగుళూరు రాజకుల్లాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణలో ఈ నిజాలు వెలుగులోకి తెచ్చారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.












