త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఎస్పీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లపై నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, దొంగతనాల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, చోరీ కేసుల్లో సొత్తు రికవరీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై దృష్టి సారించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనాలు సీజ్ చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, మతపరమైన ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి, సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.


