బాపట్ల, 11 జూలై 2026
విద్యా రంగ సమస్యలు, నూతన విద్యా విధానాలపై చర్చించి ప్రజా విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రెండు రోజుల రాష్ట్ర విద్యా అసెంబ్లీ ప్రారంభమైంది. జూలై 11, 12 తేదీలలో జరుగుతున్న ఈ అసెంబ్లీలో విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు, నూతన విద్యా విధానాలపై చర్చించి ప్రజా విద్య బలోపేతానికి కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జూలై 11, 12 తేదీలలో నిర్వహిస్తున్న స్టేట్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ ఘనంగా ప్రారంభమైంది.
ఈ ప్రారంభ సభకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు అధ్యక్షత వహించగా, ప్రముఖ విద్యావేత్త కె.ఎస్. చలం ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్య అతిథులుగా కేరళ ఎడ్యుకేషన్ ఫోరం నాయకులు పద్మనాభన్, ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు వి. బాలసుబ్రమణ్యం, శాసనమండలి మాజీ సభ్యులు డాక్టర్ ఎం. గేయానంద్, ఎంవీ ఫౌండేషన్ నాయకులు వెంకటరెడ్డి, గోవిందరాజులు, తవ్వ సురేష్, డాక్టర్ ఎం. చంద్రశేఖర్, జి. గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్య అందరికీ అందుబాటులో ఉండే హక్కుగా ప్రభుత్వం భావించి ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన, సమాన విద్యను ప్రతి విద్యార్థికి అందించేలా సమాజంలోని అన్ని వర్గాలు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులు, సవాళ్లు, ప్రజా విద్య పరిరక్షణ, విద్యా విధానాలపై రెండురోజుల పాటు వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు ఈ రాష్ట్ర విద్యా అసెంబ్లీలో పాల్గొన్నారు.












