చీరాల, 2026-08-29
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో గిడుగు చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎన్.ఆర్. పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు భాషా కోవిదుడు, ప్రముఖ కవి వడలి రాధాకృష్ణను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వడలి రాధాకృష్ణ మాట్లాడుతూ, గిడుగు వెంకట రామమూర్తి కేవలం భాషావేత్త మాత్రమే కాకుండా సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, చరిత్రకారుడు, రచయితగానూ విశేష సేవలు అందించారని కొనియాడారు. నేడు తెలుగు భాషను ప్రజలు సులభంగా మాట్లాడగలుగుతున్నారంటే అందుకు గిడుగు చేసిన కృషే ప్రధాన కారణమని అన్నారు. గ్రాంథిక భాషకు పరిమితమైన తెలుగును ప్రజల నిత్య జీవితంలో ఉపయోగించే వ్యావహారిక భాషగా మార్చేందుకు గిడుగు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
తెలుగు భాష గొప్పతనాన్ని, మాధుర్యాన్ని వివరించిన వడలి రాధాకృష్ణ, పర్లాకిమిడి ప్రాంతాల్లోని సవారా గిరిజనుల భాషను అధ్యయనం చేసి, వారి భాషకు లిపిని రూపొందించడంతో పాటు నిఘంటువులను తయారు చేసేందుకు గిడుగు తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం రావు సాహెబ్ వంటి బిరుదులతో సత్కరించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, కార్యదర్శి చారగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, నారాయణమూర్తి, చలపతి, శీరాం రమేష్, నాగేశ్వరరావు, మధుసూదనరావు, రామారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, కాటమరాజు, తుకారాం, రమేష్, సుబ్బారావు, శివాంజనేయ ప్రసాద్‌తో పాటు పలువురు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.












