బాపట్ల, 2026-11-27
బాపట్ల పట్టణానికి చెందిన 84 ఏళ్ల రైతు బండ్లమూడి మల్లికార్జునరావు, 35 ఏళ్లుగా సేకరించిన 159 పుస్తకాలను బాపట్ల కలెక్టరేట్ గ్రంథాలయానికి విరాళంగా అందజేశారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు అందించారు.
బాపట్ల పట్టణం పటేల్‌నగర్ మొదటి లైన్‌కు చెందిన రైతు బండ్లమూడి మల్లికార్జునరావు (84), 35 ఏళ్లుగా కొనుగోలు చేసి సేకరించిన 159 పుస్తకాలను బాపట్ల కలెక్టరేట్ గ్రంథాలయానికి విరాళంగా అందజేశారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు అందించారు. ఈ విరాళంలో ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలు, చరిత్ర వంటి అంశాలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి. కలెక్టర్ పిలుపునకు స్పందించి, దశాబ్దాలుగా సేకరించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందించిన మల్లికార్జునరావును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, జీవన విధానం గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
తన వృత్తి రైతు అని మల్లికార్జునరావు చెప్పడంతో, పుస్తక పఠనంపై ఆయనకున్న ఆసక్తిని కలెక్టర్ ప్రశంసించారు. రైతుగా జీవిస్తూ, 84 ఏళ్ల వయసులోనూ తాను సేకరించిన పుస్తకాలను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా గ్రంథాలయానికి అందించడం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. పుస్తకాలను పంచుకోవడం ద్వారా జ్ఞానాన్ని మరింత మందికి చేరువ చేయవచ్చని మల్లికార్జునరావు తన కార్యాచరణతో చాటారని అన్నారు. కలెక్టరేట్ గ్రంథాలయ అభివృద్ధికి జిల్లా ప్రజలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పుస్తకాలు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.







