Visakhapatnam/Anandapuram (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 22
కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారంపై వస్తున్న అసత్య ప్రచారాలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కొల్లేరుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పైనా మాట్లాడారు.
కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారంపై వస్తున్న అసత్య ప్రచారాలు, వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొల్లేరు అంశంతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మాట్లాడారు.
కొల్లేరు అంశంపై సుప్రీంకోర్టు కోరిన వివిధ వివరాలను అన్ని శాఖల సమన్వయంతో పక్కాగా సిద్ధం చేసి పంపుతున్నామని తెలిపారు. జిరాయితీ భూములు, డీ-ఫారం పట్టాల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కొల్లేరు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వైకాపా పాలనలో కొల్లేరు పరిరక్షణకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు నిర్మిస్తామని కేవలం కాగితాలకే పరిమితం చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గత పాలకులు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు గోపవరం సబ్‌స్టేషన్ కోసం ప్రతికూలమైన స్థలాన్ని ఎక్కువ ధరకు సేకరించి, కాగితాలపైనే మంజూరు ఇచ్చి వదిలేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అడ్డంకులన్నీ తొలగించి, సుమారు రూ. 50 కోట్లతో నిర్మాణం పూర్తి చేసి, వచ్చే ఆగస్టు నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని వెల్లడించారు.
గత పాలకులు శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి సన్నిధిలో రూ. 100 స్టాంప్ పేపర్‌పై ఇచ్చి తుంగలో తొక్కిన హామీలను తాము నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజలు, నాయకులు భోగేశ్వరం వెళ్లి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా చూడాలని కోరారు. రూ. 5.50 కోట్ల CGF నిధులతో (33% కాంట్రిబ్యూషన్) ఆలయాభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెదలంక డ్రెయిన్‌పై 15 ఏళ్ల నాటి కల అయిన అవకూరు వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ. 5.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
కొల్లేరు సమస్య పరిష్కారం ప్రస్తుతం తుది దశకు చేరినందున, ప్రజలలో అభద్రతాభావం కలిగించేలా వార్తలు రాయవద్దని కోరారు. బాధ్యతాయుతంగా, సహేతుకతతో వార్తలు ప్రచురిస్తూ కొల్లేరు శాశ్వత పరిష్కారానికి మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు గారు, నియోజకవర్గం టిడిపి ఇంచార్జి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు గారు, ఎన్డీయే (NDA) కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.










