క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-28
మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలని డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శనివారం స్థానిక కలెక్టరేట్ లో శిక్షణ కార్యక్రమం జరిగింది. బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 30వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించాల్సి ఉందన్నారు. తదుపరి సాధారణ ఓట్లను లెక్కించాలని ఆమె సూచించారు. ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సూచనలు
ప్రతి ఓటు చాలా విలువైనదని డిఆర్డిఏ పిడి బి సింగయ్య చెప్పారు. బాపట్ల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కొరకు 44 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ పత్రాలను నిశితంగా పరిశీలించాలన్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఇందుకోసం నాలుగు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా బ్యాలెట్ బాక్సులలోని పత్రాలను తెరిచి, 25 ఓట్లను ఒక కట్టగా కట్టి సిద్ధం చేసుకోవాలని సూచించారు. కట్టలు కట్టడం పూర్తయిన పిదప ఓట్లను లెక్కించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియలో మరింత జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.







