ఒంగోలు, 2026-11-28
రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఆదివారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, ఎస్పీ పి.వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఎన్నికల్లో 123 పంచాయతీలకు, 1020 వార్డులకు పోలింగ్ జరగనుంది.
రెండో విడత పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఆదివారం రెండో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎస్పీ పి.వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అద్దంకి ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు వివరాలు వెల్లడించారు.
మొత్తం వీడియో రికార్డింగ్
జిల్లాలో రెండో విడతలో భాగంగా అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని 123 పంచాయతీలకు, 1020 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే అవసరమైన శిక్షణ అందించామన్నారు. ఎస్పీతో కలిసి బల్లికురవ, సంతమాగులూరు, కురిచేడు, దొనకొండ మండలాల్లోని పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ మరియు కౌంటింగ్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సీసీటీవీల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామన్నారు. సాధారణ పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రాఫర్ల ద్వారా మొత్తం ప్రక్రియను రికార్డు చేయిస్తున్నట్లు వివరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందని, అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. ఫలితాలను అప్పటికప్పుడే ప్రకటించి, ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో నమోదు చేస్తామని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
బందోబస్తు ఇలా
ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చేపట్టిన భద్రతా చర్యలను ఎస్పీ వివరించారు. ఈ ఎన్నికల కోసం 66 అత్యంత సమస్యాత్మక, 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. మొత్తంగా 1623 మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల్లో భద్రతా విధులకు మోహరించామన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్, ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ చంద్రశేఖర నాయుడు, తహసిల్దార్ చరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







