క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్కోప్ ఫౌండేషన్ గుంటూరు వెల్పేర్ సెంటర్ లో కార్యక్రమం నిర్వహించింది.
చదువుతోనే జీవితాల్లో వెలుగులు, ఆరోగ్యంతోనే ఆనందమయ జీవనం సాధ్యమని స్కోప్ ఫౌండేషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు గుంటూరు వెల్పేర్ సెంటర్ లో ఆదివారం ఉదయం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి. కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం హాస్పిటాలిటి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్ పి. శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ, చదువుతోనే జీవితాలను మార్చుకోవచ్చని, వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ప్రధాన మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ చదువుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమాజ అభ్యున్నతికి స్కోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి. కొండలరావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా చదివించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి, మంచి హోదాలో స్థిరపడి, తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆనందంగా చూసుకుంటారని తెలిపారు. ప్రతి కుటుంబంలో విద్యాజ్యోతి వెలిగినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం డాక్టర్ రమణ దాతృత్వ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మధు, నగేష్, కాలనీకి చెందిన తల్లిదండ్రులు, చిన్నారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







