ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావితంగా ప్రకటించింది. అయితే, తిరుపతి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, జిల్లాలోని మండలాలను ఈ జాబితాలో చేర్చకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కె. మణి నాయుడు మాట్లాడుతూ, బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని 28 పంచాయతీల పరిధిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు పడక, సాగునీరు అందక రైతులు ఈ ఏడాది వందల ఎకరాల్లో వరి, మిరప వంటి పంటలు వేయలేని దుస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు.
వాస్తవాలను దాచిపెడుతున్నారని ఆరోపణ
క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ, అధికారులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు నివేదికలు పంపించారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కేవలం అధికార పక్ష రాజకీయ నాయకుల కనుసన్నల్లో, వారి అడుగులకు మడుగులొత్తుతూ కరువు జాబితాను రూపొందించిందని ఆయన ఆరోపించారు.
కరువుతో అల్లాడుతున్న బుచ్చినాయుడు కండ్రిగ మండల రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. తిరుపతి జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ సహా నష్టపోయిన అన్ని వ్యవసాయ మండలాలను వెంటనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు తక్షణమే కరువు సహాయక చర్యలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.












