నాయుడుపేట, 2026-11-27
నాయుడుపేటలో 786 రఫీపై వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలేటి నాగార్జున చేసిన అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని మంగళ్ళూరి వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాయుడుపేట పట్టణానికి చెందిన 786 సేవా సంస్థ నిర్వాహకుడు 786 రఫీపై అసత్యమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని వైఎస్ఆర్సీపీ నాయకుడు, 3వ వార్డు కౌన్సిలర్ పాలేటి నాగార్జునపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళ్ళూరి వెంకయ్య నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నాయుడుపేట పట్టణంలో 786 సేవా సంస్థను స్థాపించి అనేక సంవత్సరాలుగా పేదలకు, నిరుపేదలకు, ఆపదలో ఉన్న ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 786 రఫీ ప్రజల మన్ననలు పొందారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. సామాజిక సేవతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అయితే ఈ నెల 26వ తేదీన పాలేటి నాగార్జున కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో 786 రఫీపై అసత్యమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠకు, రాజకీయ జీవితానికి, సామాజిక గౌరవానికి భంగం కలిగిందని ఫిర్యాదులో తెలిపారు.
ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిపై రాజకీయ కక్షతో వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఫిర్యాదుదారుడు అభిప్రాయపడ్డారు. ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన పోస్టులు, ఇతర ఆధారాలను సేకరించి విచారణ జరపాలని పోలీసులను కోరారు. ప్రాథమిక విచారణలో నేరం జరిగినట్లు తేలితే చట్టాల ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు పునరావృతం కాకుండా చూడాలని, తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని మంగళ్ళూరి వెంకయ్య పోలీసులను కోరారు. ఆయనతోపాటు షరీఫ్ వెంకటేష్, సతీష్, షరీఫ్, ముడూరు శేఖర్, ఉదయ రెడ్డి పలువురు పాల్గొన్నారు.







