ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మైదుకూరు, రాజంపేట సబ్-డివిజన్ల పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో, ఎస్పీ మాట్లాడుతూ, ఎర్ర చందనం అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడానికి పోలీస్ అధికారులు కఠినమైన నిఘా, గస్తీని పెంచాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ నొక్కి చెప్పారు. గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలల్లో మహిళా భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా సోషల్ మీడియా వేధింపులపై బాలికలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జి.ఎం.ఎస్.కె ల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
అలాగే, అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని అరికట్టడానికి కఠినంగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి డ్రంకెన్ డ్రైవ్, అధిక వేగంతో వెళ్లే వాహనాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో, చట్టపరిధిలో పరిష్కరించాలని సూచించారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, రౌడీ షీటర్లు, ఎన్నికల నేరగాళ్లపై నిఘా ఉంచాలని, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో గస్తీని పెంచాలని ఎస్పీ ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, డ్రోన్ కెమెరాల సహాయంతో దాడులు నిర్వహించాలని, మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


